తృణావర్త సంహారం, నామకరణం,విశ్వదర్శనం

తృణావర్త సంహారం
అంతలోనే ఒకరోజు యశోద బాలకృష్ణుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉండగా, అకస్మాత్తుగా ఆ పసివాడు పర్వతమంత బరువుగా మారాడు. బరువు భరించలేక యశోద కృష్ణుడిని నేలపై పడుకోబెట్టింది.
సుడిగాలి రాక్షసుడు:
కంసుడు పంపిన **తృణావర్తుడు** అనే రాక్షసుడు తీవ్రమైన ధూళి, సుడిగాలి రూపాన్ని ధరించి గోకులమంతా అంధకారాన్ని సృష్టించి, కృష్ణుడిని ఎత్తుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు.
కంఠ గ్రహణం:
ఆకాశంలోకి వెళ్లాక కృష్ణుడు మరింత బరువై, తన చిన్ని చేతులతో తృణావర్తుని గొంతును గట్టిగా పట్టుకున్నాడు. రాక్షసుడు ఊపిరాడక కళ్లు బయటకు వచ్చి నేలపై పడి మరణించాడు. కింద పడిన రాక్షసుడి గుండెలపై కృష్ణుడు నవ్వుతూ కూర్చుని ఉండటం చూసి గోపికలు పరమానందంతో ఎత్తుకునీ “ఇది ఎంత ఆశ్చర్యకరము? ఈ సంఘటన మిగుల అద్భుతమైనది. ఈ బాలుడు రాక్షసుని (తృణావర్తుని) వలన మృత్యుముఖమునకు చేరియు మఱల సురక్షితముగా తిరిగివచ్చినాడు. క్రూరుడైన దుర్మార్గుడు తాను చేసికొనిన పాపమునకు తానే బలియగును. సత్పురుషుడు | రాగద్వేషరహితుడగుటవలన సకలభయముల (ఆపదల) నుండియు విముక్తుడగును. ”మనం పూర్వ జన్మలో ఎన్నో పుణ్యాలు చేశాం అందుకే పిల్లాడికి ఏం కాలేదు అని భావించారు.
—
గర్గాచార్యుల రాక & నామకరణ మహోత్సవం
వసుదేవుని కోరిక మేరకు యదువంశ కులగురువైన **గర్గాచార్యులు** రహస్యంగా గోకులానికి వచ్చి నందమహారాజును కలుసుకున్నారు. కంసునికి అనుమానం రాకుండా పశువుల పాకలో రహస్యంగా నామకరణం నిర్వహించారు.
నామ విశేషాలు:
నందా! ఇతడు రోహిణీ పుత్రుడగుటవలన ‘రౌహిణేయుడు’ అని, తన సుగుణ సంపదచే బంధుమిత్రులను ఆనందింపజేయువాడ కావున ‘రాముడు’ అనియు పిలువబడును. ఇతడు అమిత (మిగుల) బలశాలికాగలడు. అందువలన ‘బలుడు’ అనియు ప్రసిద్ధి వహించును. అంతేగాక, మీకును, యదు వంశజులకును ఎట్టి భేదములకు తావులేకుండా సామరస్యమును కూర్చువాడు కావున ‘సంకర్షణుడు’ అనియు వ్యవహరింపబడును. (శ్రీమహావిష్ణువుయొక్క ఆజ్ఞమేరకు యోగమాయ దేవకీదేవి గర్భస్థుడైయున్న ఏడవశిశువు రోహిణి కడుపున చేర్చుటచే ఈయనకు ‘సంకర్షణుడు’ అను పేరు ప్రసిద్ధికెక్కెను.
ఈ రెండవబాలుడు ప్రతియుగమునందును శుక్ల (తెలుపు) రక్త (ఎఱుపు) పీత (పసుపుపచ్చ) వర్ణములుగల (వన్నెలుగల) దేహములతో అలరారుచు లోకకల్యాణార్ధము అవతరించుచు వచ్చెను. ఈ యుగమునందు (ఇప్పుడు) కృష్ణవర్ణముతో (శ్యామవర్ణముతో) ఒప్పుచున్నందున ఇతడు ‘కృష్ణుడు’ అని వ్యవహరింపబడును.
పూర్వము ఒకప్పుడు ఈ నీ కుమారుడు వసుదేవుని | ఇంట జన్మించెను. అందువలన అభిజ్ఞులు (ఈ రహస్యమును ఎఱిగినవారు) సకలశుభలక్షణ సంపన్నుడైన ఇతనిని ‘వాసుదేవుడు’ అనియు పిలిచెదరు.ఈ నీ కుమారునకు పెక్కురూపములు, పలునామములు గలవు. అవి అతని గుణకర్మలను అనుసరించి ఏర్పడినవి. వాటిని అన్నింటిని నేను ఎఱుగుదును. సామాన్యజనులు ఎఱుగరు.ఈ కృష్ణుడు మీకు సకల శ్రేయస్సులు చేకూరుస్తాడు, ఎలాంటి ఆపద వచ్చినా ఈతని సహాయమున సులభంగా బయట పడతారు అని చెప్పి వెళ్ళిపోయాడు.
—
మట్టి తిన్న లీల & విశ్వరూప దర్శనం
కృష్ణుడు మోకాళ్లపై పాకుతూ, చిరుగజ్జెల సవ్వడులతో గోకులమంతా తిరగడం ప్రారంభించాడు. వారి గజ్జెల చప్పుడు గోకుల వాసులకు కనువిందు చేసేది.
క్రమంగా కొద్దిగా పెరిగి పెద్దయ్యారు. వారి బాల్యలీలలు చూస్తూ గోపకాంతలు ఆనందిస్తూ ఉన్నారు.
శ్రీకృష్ణుడు బాల్యచాపల్యమున చేసెడి చిలిపిచేష్టలకు అల్లరిపనులకు అంతులేకుండెను. చూచుటకు అవి ముద్దు మురిపెములను గూర్చుచున్నను గోపికలు తట్టుకొనలేకుండిరి.
అంతటవారు యశోదమ్మ కడకు వచ్చి “యశోదమ్మా! నీ కొడుకు దుడుకు చేష్టలకు అంతే లేకున్నది. అతడు వేళగాని వేళలలో (పాలు పితికెడి సమయము గాకున్నను) లేగలను ఆవులకడకు విడుచుచున్నాడు. మేము కోపముతో మందలించుచున్నను నిర్లక్ష్యభావముతో మమ్ము జూచుచు పరిహాసముతో నవ్వుచున్నాడు.
అతడు వివిధములగు చౌర్యోపాయములతో మా ఇండ్లలో ప్రవేశించి, కమ్మని పాలను, పెఱుగులను దొంగిలించి, స్వయముగా తాను కోతులకును తినుటయేగాక తోడివారికిని, పంచిపెట్టుచున్నాడు.
( రామావతారమునందు వానరులు తనకు చేసిన సాయమును గుర్తుపెట్టుకొని ఇప్పుడు కృష్ణావతారమునందు ఆ వానరులకు పాలు, పెరుగు, వెన్నలను పంచిపెట్టుచున్నాడు).
మఱియు మిత్రులును, వానరములును తృప్తి చెంది, తినుట మానినచో, అప్పుడు ఆ కుండలను పగులగొట్టుచున్నాడు. మా ఇండ్లలో తినుటకు ఏమియు దొరకనప్పుడు అతడు ఇంటివారిపై కుపితుడగుచు, ఆ ఉక్రోషముతో శయ్యలపై నిద్రించుచున్న పసిబాలురను ఏడిపించి, పాఱిపోవుచున్నాడు.
పెరుగు, వెన్నలు చీకటి గదుల్లో దాచుకున్నా పసిగట్టి దొంగిలిస్తూ ఉన్నాడు.అలా..
ఒకరోజు బలరాముడు, తోటి గోపబాలురు యశోద వద్దకు వచ్చి “అమ్మా! కృష్ణుడు మట్టి తిన్నాడు” అని చెప్పారు. యశోద కోపంతో కృష్ణుడి చేతులు పట్టుకుని: “కృష్ణా! ఎందుకు మట్టి తిన్నావు?” అని గద్దించింది.
కృష్ణుని మాట:
“అమ్మా! నేనేమీ మట్టి తినలేదు. అన్నయ్య, స్నేహితులు కావాలనే అబద్ధం చెబుతున్నారు. కావాలంటే నా నోరు చూడు!” అని తన చిన్ని నోరు తెరిచాడు.
విశ్వరూపం:
యశోద ఆ పసివాని నోట్లోకి చూడగానే… సమస్త చరాచర జగత్తు, సూర్యచంద్రులు, నక్షత్రాలు, పర్వతాలు, సముద్రాలు, ద్వీపాలు, బ్రహ్మాండం, గోకులం మరియు కృష్ణుని నోట్లో చూస్తున్న **తను స్వయంగా కూడా ఆ నోటి లోపలే కనిపించింది!** యశోద భయభ్రాంతురాలై కళ్లు మూసుకుని భగవంతుని శరణువేడింది. స్వామి మళ్లీ తన మాయతో తల్లికి వాత్సల్యాన్ని మాత్రమే మిగిల్చాడు.
జగన్నాథుడైన శ్రీమహావిష్ణువునకు (శ్రీకృష్ణునకు)స్తన్యము నిచ్చిన ధన్యాత్మురాలు ఆ యశోద. ఆ | పూర్వజన్మమునందు ఎట్టి పుణ్యము చేసినదో? ఏమో? ఈ తల్లి తన దివ్యశిశువును తన పుత్రునిగా తలంచుచు పెంచి పెద్దచేసినది. కృతార్థుడైన ఆ నందుడు ఎట్టి సుకృతములను ఒనర్చినాడో!
శ్రీకృష్ణభగవానుడు తన షడ్గుణైశ్వర్యసంపదలను మఱుగుపఱచి, గోకులమునందు ఒక సామాన్యబాలునివలె గోపబాలురతోగూడి తన బాల్యలీలను నెఱపెను.ఆ దివ్యలీలలను వినిన, కీర్తించిన వారియొక్క పాపములును పటాపంచలగును.
(నందుడు పూర్వ జన్మలో ద్రోణుడు అనే వసువు, యశోద దేవి ఆ జన్మలో ఆయనకు భార్య ధరా దేవి. భూదేవీ వరం కోరినప్పుడు దేవతలు అందరిని భూలోకంలో జన్మించమని బ్రహ్మగారు ఆదేశము ఇస్తే అప్పుడు వీరు మేం భూలోకంలో జన్మించిన సందర్భంలో మాకు శ్రీహరి పై అనన్య భక్తి ప్రసాదించమని కోరారు తథాస్తు అన్నాడు బ్రహ్మ గారు ఆ ఫలితంగానే వీరికి ఇంత భాగ్యం కలిగింది.)
1. **భగవంతుని నిర్హేతుక కృప:** విషం ఇచ్చి చంపాలనుకున్న పూతనకు కూడా మోక్షాన్నిచ్చిన పరమ దయామయుడు శ్రీకృష్ణుడు.
2. **అనంతంలో అనంతం:** చిన్ని కృష్ణుని నోటిలో సమస్త విశ్వం కనిపించడం ద్వారా, ఆ పరబ్రహ్మమే లీలామానుష విగ్రహుడై మన మధ్యకు వచ్చాడని భాగవతం నిరూపిస్తుంది.
3. **ఆనంద ప్రదాత:** గోకులానికి శ్రీకృష్ణుని రాక కేవలం రాక్షస సంహారమే కాక, భక్తులకు అపరిమితమైన బ్రహ్మానందాన్ని పంచడానికే
శ్రీకృష్ణ శరణం మమ








